అగ్రి- డ్రోన్ తయారీదారు ఐఒ టెక్ వరల్డ్ ఏవిగేషన్ నుంచి 500 డ్రోన్ల కొనుగోలుకు సహకార ఎరువుల ప్రధాన సంస్థ ఇఫ్కో ఆర్డర్లు జారీ చేసింది. ఈ మేరకు భారీ కాంట్రాక్ట్‌ను ఐఒ టెక్ పొందిందని సోమవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్లను ప్రధానంగా నానో లిక్విడ్ యూరియా, డీఏపీ స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు.
ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) తన ఉత్పత్తులైన నానో యూరియా, నానో డిఎపి (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) స్ప్రే చేయడానికి 2,500 డ్రోన్లను సేకరించాలని యోచిస్తోంది. 5,000 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను రూపొందించాలని యోచిస్తోంది. వారికి డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడంలో శిక్షణ ఇవ్వనుంది.
”డిసెంబర్ 2023 నాటికి కంపెనీ 500 డ్రోన్లను ఇఫ్కోకు డెలివరీ చేస్తుంది” అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనూప్ ఉపాధ్యాయ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ల వాడకం వల్ల సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా, పంటలపై పురుగుమందులు పిచికారీ చేయడం వంటి వ్యవసాయ కార్యకలా పాలలో డ్రోన్ల వాడకం రైతులకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని కంపెనీ మరొక సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ అన్నారు. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కంటే ఎక్కువ డ్రోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సార్క్, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైన ప్రాంతాలలో ఎగుమతి చేయడానికి అవకాశాలను కూడా అన్వేషిస్తోంది. కంపెనీ తన భాగస్వాములతో పాటు గ్రామస్థాయి పారిశ్రామికవేత్తలను సృష్టించడంపై దృష్టి సారిస్తోందని, దేశవ్యాప్తంగా రిమోట్ పైలట్ శిక్షణా సంస్థలను స్థాపించడంలో సహాయం చేస్తుందని భరద్వాజ్ తెలిపారు.