ఏపీకి జీవనదిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హితవు చెప్పారు. బిజెపి రాష్త్ర అధ్యక్షురాలిగా శుక్రవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేబడుతూ పోలవరం విషయంలో కేంద్రం వెనకడుగు వేయలేదని ఆమె స్పష్టం చేశారు.
ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎప్పుడు జాప్యం చేయలేదని చెబుతూ ఇటీవల రూ. 12వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని ఆమె గుర్తు చేశారు. తమ చేతకానితనంతో కేంద్రం మీద అభాండాలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలవరం నేషనల్ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణాన్ని చేయలేకపోతే తిరిగి కేంద్రానికి ఇచ్చేయాలని ఆమె సలహా ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర వైఖరి వల్లే ఆలస్యమని ఆమె విమర్శించారు. బాధితుల విసయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెబుతూ క్లారిటీ ఇస్తే కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని ఆమె చెప్పారు. గతంలో ఇరిగేషన్ పార్ట్ కు మాత్రమే అనుమతించారని, గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారని ఆమె చెప్పారు.
రివర్స్ టెండరింగ్ చేసి అవినీతికి తావు లేకుండా చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక కాంట్రాక్టర్ల మీద మాత్రమే జగన్ ప్రతాపం చూపించారని ఆమె మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు రూ.40-50వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
ప్రత్యేక హోదాకు దీటుగా రాష్ట్రానికి చాలా మేలు కేంద్రం చేసిందని పురందేశ్వరి స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం ఐదేళ్లలో స్థాపించాల్సిన విద్యా సంస్థల్ని, బిల్లు అమోదం పొందిన రెండేళ్లలోనే ఏర్పాటు చేశామన్నారు. జాతీయ విద్యా సంస్థలు అన్నింటిని ఏర్పాటు చేశామని చెప్పారు.
మంగళగిరి ఎయిమ్స్ కు రూ.1600కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.700కోట్లు, విశాఖ ఐఐఎంకు రూ.680 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.130కోట్లు ఎన్ఐటికి రూ. 300కోట్లు, ఓసియన్ టెక్నాలజీకి సంస్థకు రూ.250కోట్లు , నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్‌కు రూ.600కోట్లు ఇచ్చిందని ఆమె వివరించారు.
దేశంలో పిఎం అవాస్ యోజన పథకంలో నాలుగు కోట్ల ఇళ్లు ఇస్తే, ఒక్క ఏపీలో 22 లక్షల ఇళ్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. ఒక్కో ఇంటికి లక్షా 80వేలు కేంద్రం నుంచి ఇచ్చామని తెలిపారు. ఈ లెక్కలో రూ. 32,500కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. 9ఏళ్లలో 20వేల కోట్లను ఇళ్ల కోసం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం అందించిన సాయంతో ఈ పాటికి 65శాతం ఇళ్ల నిర్మాణం జరిగి ఉండాలని, కానీ 35 శాతం ఇళ్లు కూడా ప్రభుత్వాలు కట్టలేదని పురందేశ్వరి విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతూ విశాఖలో ఎంపీ భార్యా,కొడుకును కిడ్నాప్ చేసినా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బాపట్లలో 15ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారని పేర్కొంటూ సొంత బాబాయిని చంపిన కేసు ఏమైందని ఆమె ప్రశ్నించారు.
మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని ఆమె ధ్వజయంట్టారు మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని మండిపడ్డారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం లేదా అంటూ ఆమె నిలదీశారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందని, ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు