దేశంలో యూపీ తర్వాత ఆంద్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తిరుపతిలో గురువారం రూ.2900 కోట్లతో అభివృద్ధి చేయనున్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్ కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు..అంతకు మునుపు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం, రూ.500 కోట్లతో ఏపీ ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎం.వో యు జరిగిందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్క్ టెక్ నిర్మాణం చేస్తామని చెబుతూ దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామని తెలిపారు.
బెంగళూరు – చెన్నై మధ్య అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో 260 కి.మీ రహదారి నిర్మాణం చేపట్టామని, వీటిలో 92 కి.మీ ఏపీ గుడిపాల మీదుగా వెళ్తుందని చెప్పారు. చిత్తూరు -తచూరు 82 కి.మీ రూ.4,800 కోట్లు, ఢిల్లీ – చెన్నై గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి.. వీటిలో ఢిల్లీ నుంచి ముంబై మధ్య లక్ష కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నామన వివరించారు.
సూరత్ నుంచి చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏపీ గుండా 145 కి.మీ వెళ్తుందని చెప్పారు. దీనికి రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరు – విజయవాడ మధ్య 330 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, దీని ద్వారా 95 కి.మీ దూరం తగ్గుతుందని, ఆరు గంటల్లో చేరుకోవచ్చని వివరించారు.
రాయపూర్ – విశాఖ మధ్య రూ.17 వేల కోట్లతో నిర్మాణం జరుగుతుందని గడ్కరీ తెలిపారు. హైదరాబాద్- విశాఖ మధ్య రూ.7 వేల కోట్లతో నిర్మాణం, నాగ్ పూర్ – విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందని చెప్పారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 8744 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణం చేపట్టామని, ఏపీలో డబుల్ గా 2023లో చేశామన్నారు.
ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమని చెబుతూ దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్ట్స్ ఒకటి ఉందని గుర్తు చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీ పారిశ్రామికంగా మరింత అభివృధ్ది చెందుతోందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
