తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం ఒడిశాతో పాటు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య అఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయని చెప్పారు.
రాబోయే 12 గంటల్లో ఇది ఆ ప్రాంతంలో అల్పపీడన వ్యవస్థగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు. తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు.
కొన్ని తూర్పు జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలతో పాటు దాని పరిసర జిల్లాలైన సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెదపల్లి, పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
‘గురువారం తెలంగాణాలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు, తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని నాగరత్నం తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈరోజు, రేపు హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నగరంలోని కొన్ని చోట్ల అక్కడక్కడా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతం హైదరాబాద్లో ఎల్లో అలర్ట్ జారీ అయిందని తెలిపారు.
రెండు మూడు రోజులుగా ఆపకుండా వర్షాలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలను తెలిపారు.
వర్షాల కారణంగా ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆయా యూనివర్శిటీలు ప్రకటన విడుదల చేశాయి. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. భారీ వర్షాల దాటికి ప్రాణహితకు భారీగా నీరు చేరింది.ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఉప్పొంగుతోంది.
బుధవారం ఉదయానికి సుమారు 5.41 లక్షలకు నీటి సామర్థ్యం చేరింది. మరోవైపు లక్ష్మీబరాజ్ 57 గేట్లను ఎత్తారు. 5.25 లక్షల క్యుసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 33.05 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు కూడా వరద మొదలైంది.