దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి కునో నేషనల్ పార్కుకు తరలించిన చిరుతలలో 40 శాతం మరణించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఇది మంచి సంకేతం కాదని వ్యాఖ్యానించింది. చిరుతల మృతి అంశాన్ని ప్రతిష్టాత్మక సమస్యగా మార్చవద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. చీతాలను కునో పార్కు నుంచి అభయారణ్యాలకు తరలించే అవకాశాలను పరిశీలించాలని కోరింది.
ప్రాజెక్ట్ చీతా ప్రారంభ దశలో జాతీయ పులుల సంరక్షణ సంస్థకు మార్గదర్శం చేయాలంటూ కేంద్రం నియమించిన నిపుణుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిపుణుల కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ చంద్రసేన్ వాదనలు వినిపించారు.
‘ప్రాజెక్టు చీతా’పూర్తి వివరాలను నిపుణుల కమిటీకి అందజేయాలని, కమిటీ చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రశాంత్ చంద్రసేన్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్గవాయ్, జస్టిస్ జెబి పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చిరుతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తూ, తక్షణమే నివారణ చర్యలు తెలుపుతూ వివరణాత్మక అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సమస్య ఏమిటి? వాతావరణం అనుకూలించలేదా? లేక మరైదైనా కారణం ఉందా? అని అడిగింది.
ఇప్పటికే 20 చిరుతల్లో 8 మరణించాయి. భారతదేశంలో పుట్టిన మూడు పిల్లలు కూడా చనిపోయాయి. మరో రెండు చీతాల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని అభయారణ్యాలకు తరలించే చర్యల్ని ఎందుకు పరిశీలించడం లేదు? దాన్ని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చేస్తున్నార? దయచేసి కొన్ని సానుకూల చర్యలు తీసుకోండి అని కేంద్రం తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి ధర్మాసనం సూచించింది.
సుప్రీం ప్రశ్నలకు ఐశ్వర్యభాటి బదులిస్తూ, చిరుతలను తరలించిన మొదటి ఏడాదిలో 50శాతం మరణించే అవకాశం ఉందని ముందే అంచనా వసినట్లు చెప్పారు. ప్రతి చిరుత మరణానికి దారి తీసిన కారణాలపై విశ్లేషణ జరుగుతోందని, త్వరలోనే సదరు నివేదికను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.