ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారం రాజకీయ పక్షాలకు నియోజకవర్గ స్ధాయిలో సమాచారం అందించటం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోపాలు లేని ఓటర్ల తుది జాబితా కోసం ఈ అవకాశాన్ని రాజకీయ పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గురువారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ముఖ్య ఎన్నికల అధికారి సచివాలయంలోని సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, బిఎల్ఓల పాత్ర, ఈఆర్ఓలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి జారీ చేయబడిన ఏకీకృత సూచనలను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చారు.
ఈఆర్ఓలు ప్రతి వారం క్లెయిమ్లు, అభ్యంతరాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీలకు అందిస్తారని, దానినే సిఇఓ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. తొలుత ప్రత్యేక ఓటర్ల సవరణ షెడ్యూల్ను వివరించిన మీనా, 2024 జనవరి 1 అర్హత తేదీగా నిర్దారించామని, జులై 21 నుంచి బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఇంటింటి వెరిఫికేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఇంటింటి సర్వే సమయంలో బిఎల్ఓ యాప్లో సమాచారాన్ని అప్డేట్ చేస్తారన్నారు. ఇంటింటి సర్వే సమయంలో బూత్ లెవల్ ఏజెంట్లు బిఎల్ఓలతో కలిసి వెళ్లవచ్చన్నారు. ఇంటింటి సందర్శనల షెడ్యూల్ను జిల్లా స్థాయిలోని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు.
బిఎల్ఓలు జులై 21న ఇప్పటికే ఉన్న సమాచారాన్ని అధికారికంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకుంటారని, ఇంటింటి ధృవీకరణ పూర్తయిన తర్వాత, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే రాజకీయ పార్టీలు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావచ్చని, వారు పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలను సిఇఒకు పంపుతారని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
అక్టోబర్ 17వ తేదీన ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురించి, వాటిపై క్లెయిమ్లు, అభ్యంతరాలు నవంబరు 30 వరకు స్వీకరిస్తారన్నారు. తుది జాబితాలు 2024 జనవరి 5 ప్రచురిస్తామని వివరించారు. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేసారు. తెలుగుదేశం పార్టీ బిఎల్ఓ పరిశీలన సమయంలో వాలంటీర్లను దూరం పెట్టాలని కోరగా, ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని మీనా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించరాదని కోరగా, ఎన్నికల సంఘం నిబంధనావళి మేరకు శాశ్వత ఉద్యోగులనే నియమించామన్నారు. సిపిఎం పార్టీ ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో అందించాలని కోరారు.