ఎపిలోని వాలంటీర్ వ్యవస్థపై చేసిన వాఖ్యలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయాలని ఒక వంక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, మరోవంక ఈ వ్యవస్థపై తన దాడులను పవన్ కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ విషయంలో తగ్గేదేలే అంటున్న పవన్ కోర్టుల్లో తేల్చుకుంటామంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మరింత దూకుడు పెంచారు.
ఈ విషయమై హైకోర్టును జనసేన ఆశ్రయించనుట్లు నసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఆదివారం తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నదనేది జనసేన ప్రధాన అభ్యంతరం. అలాగే చాలా ప్రాంతాలలో వాలంటీర్లు తమ హోదాను దుర్వనియోగం చేస్తున్నారంటూ పవన్ పదే పదే చెబుతున్నారు.
వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళ్తుందని పవన్ ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు తప్పుచేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని పవన్ నిలదీస్తున్నారు. అసలు ఈ వ్యవస్థకు ఎవ్వరు జవాబుదారీ అంటూ నిలదీస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ల వార్ కొనసాగుతోంది. నిన్న బైజూస్ ఒప్పందం, వాలంటీర్లను ఓటర్ల తనిఖీల్లో వినియోగించడంపై ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి వాలంటీర్ల లక్ష్యంగా పవన్ ప్రశ్నలు సంధించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్
జగన్ మాట్లాడిన వీడియోను పోస్టు చేసిన పవన్… ఏపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్! మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 1.వాలంటీర్ల బాస్ ఎవరు? 2.ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు? 3.వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?” అని జగన్ను పవన్ ప్రశ్నించారు.
‘‘వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్’’ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను షేర్ చేశారు. అలాగే క్రూడ్రాయిల్ ఎంత విలువైనదో డేటా కూడా అంతే విలువైనది అంటూ ట్విట్ చేశారు. మరోవంక, ఎన్నికల్లో విధుల్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓటర్ల లిస్టు తనిఖీ కోసం వాలంటీర్లను వెంటపెట్టుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ వైసీపీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుందని పవన్ ఆరోపించారు. వాలంటీర్లను ఓటర్ వెరిఫికేషన్ లో వినియోగిస్తున్నారని పలు పేపర్ల క్లిప్పులను ట్వీట్ చేశారు.
వీటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే, పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్న పేపర్ కటింగ్లో ఉన్న బీఎల్వోలను ఇప్పటికే సస్పెండ్ చేశామని అధికారులు అంటున్నారు. కర్నూలు జిల్లాలో వాలంటీర్ల ఓటర్ల వెరిఫికేషన్ లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ జిల్లా కలెక్టర్ డా.సుజనా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాలంటీర్లను తీసుకెళ్లిన అధికారులను సస్పెండే చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.