వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో వీఆర్ఏ క్రమబద్దీకరణ, సర్దుబాటుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
61 ఏండ్లు దాటిన వీఆర్ఏలు తమ ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్దీకరణకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
వీఆర్ఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులను రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు వెల్లడించారు. వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో నిరక్షరాస్యులు, వివిధ విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని పేర్కొన్నారు.
అందువల్ల విద్యార్హతను బట్టి ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా వారందరినీ వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి, వారి విద్యార్హతకు తగిన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.
61 ఏండ్లు పైబడిన వీఆర్ఏలు వారి వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2, 2014 నాటికి 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణిస్తే… వీఆర్ఏ వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలోనే సేకరించాలని అధికారులను ఆదేశించారు. వీరిని కూడా నిబంధనల అనుగుణంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
