విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్ స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు.
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ కార్గో రెగ్యులేటెడ్ ఏజెంట్ అభ్యర్థన మేరకు అవుట్ బౌండ్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. విశాఖ విమానాశ్రయం నుంచి మాత్రం అన్ని కార్గో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు.
అలాగే అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కామన్ యూజర్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో టెర్మినల్ (సీయూడీసీటీ) కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీసుకున్న నిర్ణయం కారణంగా విజయవాడ విమానాశ్రమంలో సైతం డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయన వివరించారు.
డొమెస్టిక్ ఎయిర్‌కార్గోను స్వయంగా హ్యాండిల్ చేస్తామంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ ముందుకు వచ్చినందున దీనిపై ప్రతిపాదనలను సమర్పించవలసిందిగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులను కోరినట్లు వి.కె.సింగ్ వెల్లడించారు.