కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా వనమా గెలవగా ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు.
ఆయనపై బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వనమా ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, భార్య ఆస్తి వివరాలను పొందుపర్చలేదని జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారంటూ కోరారు.
సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో హైకోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వనమాకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వదనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. దానికి ఆయన కొడుకు వనమా రాఘవపై వచ్చిన ఆరోపణలే కారణమనే ప్రచారం ఉంది.