తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, ములుగు, కరీంనగర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో గత 24 గంటల్లో 649.8 మి.మీ. వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో గత 24 గంటల్లో 616.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా రేగొండలో 459.8 మి.మీ. వర్షం కురవగా.. చెల్పూరులో 457 మి.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణశాఖ రాష్ట్ర ప్రజానీకానికి హెచ్చరికలు జారీ చేసింది.
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మహబూబ్నగర్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది
ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50.50 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం వద్ద గోదావరిలో 12.86 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
భూపాలపల్లి- పరకాల ప్రధాన రహదారిపై మొరంచలో దాదాపు 15 ఫీట్స్ హైట్లో నీరు చేరి ఊరు నీట మునిగింది. దీంతో స్థానిక ప్రజలు అంత కూడా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కి వర్షములో గడుపుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని ఆ ఉరి ప్రజలు కోరుతున్నారు.
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో విరభద్రవరంలోని ముత్యం దార జలపాతం వీక్షించేందుకు బుధవారం సుమారుగా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 80 మంది అడవిలోకి వెళ్ళగా తిరుగు ప్రయాణంలో వాగు ఉధృతి పెరగడంతో దాటలేక అక్కడే చిక్కుకుపోయారు.
చీకటి పడడంతో నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. భయభ్రాంతులకు గురైన వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేశారు. ఫోన్ లో వారికీ జిల్లా ఎస్పీ తగు జాగ్రతలు చెప్పి హుటాహుటిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను, స్థానిక పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ లను అప్రమత్తం చేశారు.
వెంటనే సంఘటనాస్థలాన్ని చేరుకుని వారిని కాపాడేందుకు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు 80 మందిని సురక్షితంగా కాపాడారు. అనంతరం వారికి ఆహారం మందులు అందజేశారు.