ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. దీని ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని తెలిపింది. ఇదే జిల్లా వాజేడులో 2013 జూలై 19న 51.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన, 200 కేంద్రాల్లో 10 సెం.మీకుపైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు, మధ్య తెలంగాణవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి.
హైదరాబాద్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.
గత 6 గంటల్లో 60 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, తదుపరి కొన్ని గంటల్లో 30-40 మి.మి వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెలలో గరిష్ఠ వర్షపాతం నమోదవ్వగా, వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కానున్నదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ మినహా (-39మి.మీ) ఈ సీజన్లో 60 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సాధారణ వర్షపాతం 321.1 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 513.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60 శాతం అధికం. ఈ సీజన్లో హనుమకొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
మున్నేరు వరద నీరు జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో విజయవాడ- హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు ఆపేశారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. అక్కడి పరిస్థితుల నేపధ్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. పోలీసు అధికారుల సూచన మేరకు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను గురువారం సాయంత్రం నుంచి అధికారులు ఆపేశారు. అత్యవసరమైతే ఖమ్మం మీదుగా సూర్యాపేట నుంచి ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలను రక్షించాలని, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రులను ఆదేశించారు.
మూడు, నాలుగు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం కాస్త తెరిపినిచ్చింది. అయితే ఆకాశం మాత్రం మేఘాలతో కమ్ముకుని ఉంది. కాగా, సిటీలోని పలు ప్రాంతాల్లో ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయ్యింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీన పడనుండటంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న ప్రకటించారు. కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప తెలంగాణలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పారు.
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికోసం ఎస్కేప్ గేట్ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల వద్ద నీరు ఉన్నది.