మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు.
”మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హౌం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం” అని తెలిపారు.
కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశామని చెబుతూ రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశామని చెప్పారు. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైందని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు.
”మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ యాక్ట్గా కేసులు నమోదు చేశాం. మిగిలిన ఐదు కేసులలో విచారణ చివరి దశకి వచ్చింది. త్వరలోనే ఆ కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తాం” అని వెల్లడించారు.
మార్గదర్శి చిట్ఫండ్ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించారని తెలిపారు. డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా కాగితాలు చదవాలని ఆయన హితవు చెప్పారు. డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా కూడా అవగాహన కలిగించాలని చెబుతూ ఇది కార్పొరేట్ ఫ్రాడ్ అని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ స్పష్టం చేశారు.