ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.
ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ని సీఎం వైయస్ జగన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ధీరజ్ సింగ్ ఠాకూర్ గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. 1964 ఏప్రిల్ 25న జస్టిస్ ఠాకూర్ జన్మించారు.1989 లో ఢిల్లీలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన జమ్మూకాశ్మీర్ లో న్యాయవాదిగా పనిచేశారు. 2011లో ఆయన సీనియర్ అడ్వకేట్ అయ్యారు.
2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న ఠాకూర్ ముంబై హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముంబై నుండి ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ సింగ్ ఠాకూర్ కుటుంబంలో అందరూ న్యాయమూర్తులే. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోదరుడు.