పది రోజులుగా కుండపోత వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరణుడు శాంతించాడు. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెదర్ బులిటెన్‌ను విడుదల చేసింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వివరించింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వెల్లడించింది. మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురుస్తాయని తెలిపారు. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరును మించి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, కుమరంభీంఆసీఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరునుంచి మించి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌కు సంబంధించి వర్షాల రాక కొంత ఆలస్యం అయినప్పటికీ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది.
జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 65శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, ఖమ్మం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది.
జులై 17 వరకూ 54 శాతం లోటు వర్షపాతంలో ఉన్న తెలంగాణ వాతావరణ పరిస్థితులు నాలుగు రోజుల్లోనే మారి పోయాయి. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా సంచలనం గొలుపుతూ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెంటీమీటర్ల వర్షం కురిసి రెయిన్‌ఫాల్ రికార్డుల్లో ప్రత్యేక పేజిని రాసిపెట్టేలా చేసింది.
అంతకు ముందు 2013 జులై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షంతో అదే అప్పటికి సరికొత్తరికార్డును సృష్టించింది. మొన్నటివరకూ ఇదే భారీ రికార్డుగా కొనసాగుతూ రాగా లక్ష్మిదేవిపేటలో కురిసిన వర్షం గత రికార్డులను దాటేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఆగస్ట్ మూడు వవరకూ భారీ వర్షాలు లేనట్టే అని , అంతే కాకుండా ఎటువంటి హెచ్చరిఇకలు కూడా వుండకపోవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగుల కంటే పెరిగింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జిల్లా యంత్రాంగం జారీ చేసింది. రాత్రి 9 గంటల ప్రాంతానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.1 అడుగుగా నమోదయింది. పద్నాలుగు లక్షల 32 వేల వరద ఉధృతి దిగువకు వదులుతున్నారు.