జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కోచ్ బీ5లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటు చేసుకుంది.
జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో విధి నిర్వహణలో ఉన్న చేతన్ కుమార్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఆటోమెటిక్ వెపన్తో ఏఎస్ఐ టికా రామ్ మీనాపై కాల్పులు జరిపాడు. అనంతరం మరో కోచ్‌లోకి వెళ్లి.. ముగ్గురి ప్రయాణికులపై తుపాకీతో విరుచుకుపడ్డాడు.
దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలు విడిచారు. ఏఎస్ఐ కూడా చనిపోయారు. దీంతో చేతన్ కుమార్ దహిసర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు దిగి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని మీరా రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
చేతన్ వద్ద ఉన్న ఆటోమెటిక్ వెపన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది.