2024 ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ సంచలనంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన `వారాహి విజయ్ యాత్ర’ మూడవ విడత విశాఖపట్నం నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఉభయ గోదావరి జిల్లాలో జరిపిన యాత్రకు అనూహ్యంగా స్పందన లభించింది.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం ఈ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుందని వెల్లడించారు.
రెండు విడతలను మించిపోయేలా విశాఖ నగరంలో పవన్ వారాహి యాత్ర ఉండాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల స్పష్టం చేశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జనసైనికులు సమష్టిగా కృషి చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో జరిపిన యాత్రలో వైసిపి ఎమ్యెల్యేలను, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపాయి. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధించారు.
ఇక, పశ్చిమ గోదావరిలో వాలంటీర్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలు రాజకీయ ప్రకంపనాలు సృష్టించాయి. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని, త్వరలోనే అక్కడికి తాను మకాం మార్చుతానంటూ సీఎం జగన్ చెబుతూ ఉండడంతో ఆయన విశాఖలో చేపట్టబోయే యాత్ర మరింత ఆసక్తి కలిగించే అవకాశం ఉంది.
విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని, రిషికొండను మొత్తం తవ్వేశారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇటీవల స్వయంగా వైసిపి ఎంపీ కుటుంభం సభ్యులు అపహరణకు గురయ్యారు. ఇక స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎప్పుడూ పవన్ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
దానితో విశాఖ నుండి పవన్ జరిపే యాత్ర రాజకీయంగా మరింత కలకలం రేపే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఎన్నికలలో విశాఖ నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీచేశారు. విశాఖ నగరంలో సహితం జనసేనకు తగురీతిలో బలం ఉంది.
మరోవంక, వారాహి యాత్ర మూడో విడత సందర్భంగా విశాఖలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని నాదెండ్ల తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.