డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు అతలాకుతలమైంది. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు, నివాస సముదాయాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి.
విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా 20 మంది చనిపోయారని, పదుల సంఖ్యలో గల్లంతయ్యారని సమాచారం. సుమారు 8.5 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బీజింగ్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి బుధవారం మధ్య బీజింగ్ లో 744.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. 1891లో రికార్డు స్థాయిలో 609 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ రికార్డు ఇప్పుడు బద్దలైందని వెల్లడించింది.
తాజా జలవిలయానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బీజింగ్ లో సాధారణంగా వేసవి కాలం కూడా పెద్దగా ఉష్ణోగ్రతలు నమోదు కావు. కానీ, ఈ సంవత్సరం వేసవిలో బీజింగ్ సహా చైనా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
బీజింగ్ తో పాటు, ఆ నగరం చుట్టూ ఉన్న హెబీ రాష్ట్రం తీవ్రమైన వరదలతో అల్లకల్లోలమయ్యాయి. అక్కడి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. నివాస ప్రాంతాలకు సమీపంలోని చెరువులు ఉప్పొంగి, జనావాసాలను ముంచెత్తాయి.
పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించారు. వరద బాధితుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. రహదారులపై భారీగా నీరు నిలవడంతో బోట్లపై వెళ్తూ, సహాయ కార్యక్రమాలు చేపడ్తున్నారు.
నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు డోక్సురి తుపాను కారణంగా బీకర వర్షాలు కురిస్తే, ఇకపై ఆ పని ఖానున్ తుపాను చేయనుంది. ప్రస్తుతం ఈ ఖానున్ తుపాను జపాన్ లో అల్ల కల్లోలం సృష్టిస్తోంది. ఇది చైనా దిశగా ప్రయాణిస్తోంది. ఈ వారాంతంలో చైనాపై విరుచుకుపడే అవకాశముంది. దాంతో, మరోసారి, రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి, చైనా జల దిగ్భంధం లో చిక్కుకునే ప్రమాదముంది.