తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలతో రెండు పార్టీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి. పరిస్థితి చేయి దాటిపోతోండటంతో పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయినప్పటికీ – వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. పారా మిలటరీ బలగాలపైనా రాళ్లు విసిరారు. ఈ పరిణామాలతో పుంగనూరు రణరంగంగా మారింది.
దీనిపై పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్ట్ ఈ అల్లర్లకు చంద్రబాబే ప్రధాన కారకుడని ఆరోపించారు. అధికారంలోకి రాలేమనే విషయం తెలిసి ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. పుంగనూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తోన్నాడని మండిపడ్డారు.
ఇలాంటి చర్యలతో తనను ఓడించాలనుకుంటే అది చంద్రబాబు భ్రమేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరుకు 200 మంది బయటి వ్యక్తులు, టీడీపీకి చెందని వారిని చంద్రబాబు తరలించాడని విమర్శించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఓటమి భయంతో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోన్నాడని మండిపడ్డారు.
కాగా పుంగనూరు ఉదంతంపై అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ దాడులకు నిరసనగా జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు జిల్లాలో బంద్ పాటిస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.