తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.
టీటీడీ చైర్మన్ పదవి రేసులో మొదట్నుంచి ముగ్గురు పేర్లు గట్టిగా వినిపించినప్పటికి చివరకు కీలక పదవి భూమన కరుణాకర్‌రెడ్డిని వరించింది. భూమన గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.
ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ సీఎం ఉండగా రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. చివరకు భూమనకు పదవి వరించింది.
సీఎం వైఎస్ జగన్ తత్తగారైన వైఎస్ రాజారెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన కరుణాకర్ రెడ్డి చివరి వరకు ఆయన కాంట్రాక్టర్ల వ్యవహారాలు చేస్తూండేవారు. విద్యార్ధి నాయకుడిగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ఆ తర్వాత వైఎస్ కుటుంబంతో అనుబంధం కారణంగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు.
గతంలో ఉప ఎన్నికల్లో తిరుపతి ఎమ్యెల్యేగా ఒకసారి గెలుపొందగా, 2019లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అంతకు ముందు తుడా చైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ నుండి బైటకు వచ్చినప్పటి నుండి ఆయనతోనే ఉంటూ వస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా బిసి సామజికవర్గంకు చెందిన నేతను ఈ పదవిలో నియమిస్తున్నట్లు వార్తలు వచ్చిన్నప్పటికీ చివరికి వైఎస్ కుటుంభంకు సన్నిహితుడినే నియమించారు.
ప్రస్తుత చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి సహితం వైఎస్ జగన్ కు బాబాయి కావడం గమనార్హం. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలు అప్పచెప్పడంతో పాటు, ఎన్నికల్లో పోటీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. కరుణాకరరెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ముందుగానే ప్రకటించారు. తన కుమారుడిని నిలబెట్టేందుకు చూస్తున్నారు.