ప్రజాగాయకుడు గద్దర్(76) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. గుండెపోటుతో ఇటీవల అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుప్తరిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు.
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు. గద్దర్ మృతిపై అపోలో వైద్యులు ప్రకటన జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ అమీర్ పేట్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
జులై 20న గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు. ఆయన గుండె సమస్య నుంచి కోలుకున్నాయి. అయితే ఆయనకు గతంలో ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు ఉన్నాయి. వయసు పైబడడంతో ఈ సమస్యలు మళ్లీ తలెత్తి ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.
దళిత రచయిత గద్దర్ గా సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. గద్దర్ మెదక్ జిల్లా లోని తూఫ్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ లో, ఇంజినీరింగ్ విద్య హైదరాబాద్ లో పూర్తిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ యాక్టివ్ గా పాల్గొన్నారు.
ఆయన ఊరురా తిరిగి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథ ప్రదర్శన ఎంచుకున్నారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశారు. ఆయన రాసిన మొదటి ఆల్బం పేరు గద్దర్ అని పెట్టారు. అనంతరం ఆ పేరే ఆయన పేరుగా స్థిరపడింది.
1975లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు(మరణించారు), వెన్నెల ఉన్నారు. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు.