టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ ఆమోదం తెలిపారు. దానితో ఈ విషయమై మూడు రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. ఈ బిల్లుపై ముందుగా గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. పలు విషయాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు.
ఆదివారంతో వర్షాకాల సమావేశాలు ముగియనుండడతో సభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. అధికారులు గవర్నర్ తమిళి సై సందేహాలకు వివరణ ఇచ్చారు. వీరితో సమావేశం తర్వాత ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ లోగా అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగించారు.
టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం ఆసక్తికర పరిణామాలు జరిగాయి. బిల్లుపై గవర్నర్ పలు విషయాలపై వివరణ కోరడంతో ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, అప్పటికీ సంతృప్తి చెందని రాజ్‌భవన్ శనివారం మధ్యాహ్నం మళ్లీ సందేహాలు వ్యక్తం చేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వివరణలు ఇచ్చింది.
శనివారం ఉదయం ఆర్టీసీ కార్మిక సంఘాలు రాజ్ భవన్ ముట్టడి చేపట్టాయి. దీంతో కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బిల్లును అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని వారికి స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమంకు భరోసా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిణామాల మధ్య ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే తాజాగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇవాళ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆగస్టు 3 తేదీ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టాలని నిర్ణయించారు. అయితే ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న బిల్లు ముసాయిదాను రాజ్‌భవన్‌కు పంపారు.
ఈ బిల్లుపై పలు సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. రెండ్రోజుల్లో బిల్లు ఆమోదంపై ఆసక్తి పరిణామాలు జరిగాయి. శనివారం ఉదయం ఈ బిల్లుపై గవర్నర్ వివరణలు కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ గవర్నర్ ఐదు అభ్యంతరాలపై వివరణ ఇచ్చింది.
అయితే ఈ సమాధానాలపై సంతృప్తి చెందని గవర్నర్ మరిన్ని సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని, ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తారు. వీటికి శనివారం సాయంత్రం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆదివారం రవాణాశాఖ అధికారులు గవర్నర్ తో భేటీ అయి వివరణ ఇచ్చారు. దీంతో బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.