అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. టిడిపి కేడర్పైనా దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
పైగా ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని ఫైరయ్యారు. ఈ రోజు విజయనగరంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. “మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి” అని డిమాండ్ చేశారు.
‘‘తంబళ్లపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ ఇప్పుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నన్ను తిరగనివ్వడంలేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఒక పథకం ప్రకారం తనను అడ్డుకుని, హత్య చేయడానికి ప్రయత్నించారని టిడిపి చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడికెళ్లినా తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను పారిపోవాలా? ఎన్ఎస్జీ భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక అర్థమేముంది? వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసే దోపీడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను” అని తేల్చి చెప్పారు.
అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. తనపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. రోడ్డు పైకి ఆ రోజు ఉదయం వైసీపీ వాళ్లు వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
తనపై హత్యాయత్నం జరిగింది కాబట్టి వెంటనే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరూ తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలని స్పష్టం చేశారు. తనపై ఎన్ఎస్జీ, మీడియా, ప్రజల సాక్షిగా జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరగాలని చంద్రబాబు పేర్కొన్నారు.