ఇటీవల ఓ చిత్రంలోని (బ్రో) సన్నివేశాల వల్ల వివాదం చెలరేగిందని, దీని వల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు సహా వ్యక్తిగత విషయాలపై సినిమా తీస్తామని కొందరు ప్రకటిస్తుండటం పట్ల ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లోకి మహిళలను, పిల్లలను లాగొద్దని ఆమె అభ్యర్ధించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, రాజకీయంగా ఎదుర్కోండి అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఆమె హితవు చెప్పారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో “ఫిల్మ్ ఫ్యామిలీలో పిల్లలు పుట్టారు.. వాళ్ల తండ్రి (పవన్ కల్యాణ్) రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పిల్లలు అయినందున వారిపై దృష్టి ఉంటుంది. కానీ వారు ఇంకా పిల్లలు. రాజకీయాలతో వారికి ఏం సంబంధం? ఏం జరుగుతుందో వారికి ఏం సంబంధం? అందుకే ఒక తల్లిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ఆమె వీడియోలో విజ్ఞప్తి చేశారు.
“ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్, సపోర్టర్స్ ఎవరైనా పిల్లలను ఈ విషయాల్లోకి లాగొద్దు. నా పిల్లలనే కాదు. ఏ రాజకీయ నాయకుడైనా, యాక్టర్స్ పిల్లలైనా వారిని ఇలాంటి విషయాల్లో లాగొద్దు” అని రేణు దేశాయ్ కోరారు. రాజకీయ, సామాజిక విషయాల్లో మొదటి నుంచి పవన్ కల్యాణ్‌కు తాను మద్దతునిస్తూనే ఉన్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
తన విషయంలో పవన్ కల్యాణ్ చేసింది తప్పేనని ఆమె స్పష్టం చేశారు. కానీ ఆయన సమాజానికి మంచి చేసేందుకే పని చేస్తున్నారని తాను నమ్ముతున్నానని రేణు దేశాయ్ చెప్పారు. “సమాజానికి మంచి చేసేందుకే ఆయన పని చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన మనీ మైండెడ్ కాదు. ఆయనకు డబ్బు అంటే ఆసక్తి లేదు. ఎప్పుడూ సమాజానికి మంచి చేయాలని అనుకుంటుంటారు” అని రేణు దేశాయ్ తెలిపారు.
తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి రాజకీయంగా పవన్‌కు సపోర్ట్ చేశానని, చేస్తూనే ఉంటానని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు. “సమాజం కోసమే వ్యక్తిగత జీవితాన్ని పవన్ వదులుకున్నారని నేను నమ్ముతున్నాను. పవన్ కల్యాణ్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడల్లా ఆయన వ్యక్తిగత జీవితాన్ని లాగొద్దండి. మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించవద్దు. పవన్ కల్యాణ్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే.. సమాజానికి మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నా” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
బ్రో సినిమాలోని శ్యాంబాబు పాత్ర వివాదాస్పదమైంది. ఆ పాత్రతో తనను టార్గెట్ చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఈ వివాదంలో కొంతకాలం మాటల యుద్ధం నడిచింది.