చిరుత దాడి నేపథ్యంలో నడకదారిలో వెళ్లే యాత్రికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యాత్రికుల రక్షణ కోసం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాత్రికుల భద్రతకు టిటిడి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భరోసా ఇచ్చారు.
ఇకపై కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక ఊతకర్రను ఇవ్వనున్నామని, ఘాట్రోడ్లో వెళ్లే టూవీలర్స్‌కు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతిస్తామని, భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించామని తెలిపారు. నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని సూచించారు. ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లను అనుమతించమని స్పష్టం చేశారు. భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించామని తెలిపారు. భక్తులపై చిరుత దాడుల గురించి చర్చించామని, భక్తుల భద్రతలకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు.
వ్యర్థ పదార్థాలు బయటే వదిలేసే షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తామని… భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.