యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈవో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో మరింత మెరుగైన సేవలందించాలని, ప్రతి ఒక్కరు మధుర స్మృతులతో తిరిగి వెళ్లేలా చూడాలని పిలుపునిచ్చారు.
శ్రీవారికి యాత్రికులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆలయం వెలుపల నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాట్ను చేసినట్లు చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో హుండీలను సులభంగా పరకామణి భవనంలోనికి తరలిస్తున్నట్లు తెలిపారు.
పరకామణిని మరింత సులభతరం చేసేందుకు కాయిన్స్ వేరుచేసే మిషన్, కరెన్సీ కౌంటింగ్, ప్యాకింగ్ మిషన్లు త్వరలోనే వస్తాయని ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ అన్నదానం ట్రస్టు ద్వారా ప్రతి రోజు 2 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. 1985లో రెండు వేల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ రోజు ఎంతమందికైనా ప్రసాదాలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
తిరుమలలో వసతి గదులు నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు అయ్యిందని చెబుతూ రూ.120 కోట్లతో భక్తులకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలతో వీటిని ఆధునీకరించినట్లు తెలిపారు. తిరుమలలో మరో 10 వేల మంది యాత్రికులకు వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.100 కోట్లతో పిఏసి 5 నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు. నడక మార్గాల్లో క్రూరమృగాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.