కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా ఉంటూ వస్తున్నాయి. వరుసగా ఆరోనెల లక్ష కోట్ల రూపాయలకు మించి వసూలయ్యాయి. గత నెల డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ ) స్థూల వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పుంజుకోవడంతోపాటు పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తుండటం ఇందుకు దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే గత నవంబర్ వసూళ్లకన్నా కొంచెం తగ్గాయి. నవంబరులో జీఎస్టీ ఆదాయం రూ.1.31 లక్షల కోట్లుగా నమోదైంది.
ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలకు జీఎస్టీ ఆదాయం రూ.1,29,780 కోట్లుగా నమోదైంది. అందులో సెంట్రల్జీఎస్టీ (సీజీఎస్టీ ) వాటా 22,578 కోట్లు కాగా, స్టేట్జీఎస్టీ రూ.28,658 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ ) రూ.69,155 కోట్లుగా ఉంది. పరిహార సెస్సు రూపంలో మరో రూ.9,389 కోట్లు వసూలైంది.
2020 డిసెంబరులో నమోదైన రూ.1.15 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే, గతనెల జీఎ్‌సటీ వసూళ్లు 15 శాతం వృద్ధి చెందగా.. 2019 డిసెంబరుతో పోలిస్తే 26 శాతం పెరిగాయి. జీఎ్‌సటీ ఆదాయ వృద్ధి మున్ముందు నెలల్లోనూ కొనసాగనుందని ఆర్థిక శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి నెలవారీ సగటు వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లకు పెరిగాయి. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో రూ.1.15 లక్షల కోట్లు, తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.1.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
అయితే, గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ లో జీఎస్టీ వసూళ్లు 2 శాతం తగ్గగా, తెలంగాణాలో మాత్రం 66 శాతం పెరిగాయి. డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్లోజీఎస్టీ వసూళ్లు రూ.2,532 కోట్ల మేర ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక,డిసెంబరులో తెలంగాణ నుంచి రూ.3760 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.