గడువు లోగా రెన్యువల్ చేయించుకోక పోవడం, కనీసం అందుకోసం దరఖాస్తు చేసుకోక పోవడం కారణంగా దేశంలో సుమారు 6,000 స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు పొందడానికి తప్పనిరైన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) కింద లైసెన్సులను కోల్పోయాయి.
ప్రస్తుతమున్న లైసెన్సు గడువు అక్టోబర్ తోనే ముగిసినా, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ డిసెంబరు 31కు పొడిగించింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎన్జీవోలు దీనికోసం దరఖాస్తు పెట్టుకోగా , మరికొన్ని కారణాల వల్ల వాటిని అధికారులు తిరస్కరించారు.
ఇక మరికొన్ని సంస్థలు గడువు ముగిసినా లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విధంగా మొత్తం 5933 ఎన్జీవోలు శనివారం నాటికి విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయినట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో శనివారం నాటికి 22,762 ఎఫ్సిఆర్ఎ నమోదిత ఎన్జీవోలు ఉండగా, నేడు ఆ సంఖ్య16,829 కి తగ్గినట్టు పేర్కొంది. 2010 ప్రాంతంలో పి చిదంబరం కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న సమయం నుండి ఎఫ్సిఆర్ఎ నిబంధనల అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో దేశంలో ఈ సదుపాయం గల మొత్తం సంస్థల సంఖ్య అప్పటి నుండి 60 శాతంకు పైగా తగ్గింది.
లైసెన్సులను కోల్పోయిన వాటిల్లో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా, భారతీయ సంస్కృతి పరిషద్, డీఎవీ కాలేజి ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ఉన్నాయి.
వీటితో పాటు ఐఐటీ ఢిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, దేశం మొత్తం మీద 12 ఆస్పత్రులను నిర్వహిస్తున్న ఇమాన్యుయల్ హాస్పిటల్ అసోసియేషన్, విశ్వధర్మయత్న్, మహర్షి ఆయుర్వేద ప్రతిష్ఠాన్ కూడా ఉన్నాయి.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కో ఆపరేటివ్స్, హమ్డార్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, గోడ్రేజ్ మెమోరియల్ ట్రస్ట్ , జెఎన్‌యు న్యూక్లియర్ సొసైటీ, లేడీ శ్రీరామ్ కాలేజీ, ఇండియా హేబిటేట్ సెంటర్ ఆల్ ఇండియా మార్వారీ యువ మార్చ్ వంటి ప్రముఖ ఎన్జీవొలు కూడా ఉన్నాయి.