ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని, అయితే నిర్ణయం ప్రజలదే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవికి సిద్ధమని తాను పిఠాపురంలో, గాజువాక సభలలో చెప్పానని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్య దేశమని, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తన సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలని చెబుతూ తాను ఉభయ తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడు, కర్ణాటకలలో ప్రభావితం చేయవచ్చునని తెలిపారు. కానీ రాజకీయాలు వేరని, ఓట్లు చీలకూడదనే ఉద్ధేశ్యంతో తాను ఉన్నానని చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తా? లేక బిజెపితో వెళ్లడమా? అన్నది చర్చలు జరుగుతున్నాయని చెబుతూ ఏదేమైనా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ప్రకటించారు.
జగన్ పక్కా వ్యాపారిలా మారిపోయాడని, వైఎస్ఆర్సిపి వచ్చాక రాష్ట్రంలో క్రిమినాలిటీ వ్యవస్థీకృతమైందని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్లలా జగన్ విభజించి పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. మైనింగ్ దోపిడీ పెరిగిందని, వైఎస్ఆర్సిపి నేతలు ఉత్తరాంధ్ర వనరులు దోచేస్తున్నారని ఆరోపించారు.
లాటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, తాడేపల్లిలో నేరాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బాధితులు పోలీసుల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే నిన్న విశాఖలో వద్దకు 400 పిటిషన్లు వచ్చాయని చెప్పారు. బాధితులను కేసులు ఉపసంహరించుకోమని పోలీసులే చెప్పడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
2004 నుండి కొనుగోలు చేసిన భూమి కోసమే విశాఖకు వస్తున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర వనరులను దోచేస్తే అడిగేవారు లేరా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో భూదోపిడీ పెరిగిందని, రాష్ట్రం నేరాలకు నిలయంగా మారిందని విమర్శించారు. చిత్తూరులో ఒకేరోజు చాలామంది బాలికలు అదృశ్యమైతే, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని అడుగుతున్నారని వాపోయారు.
అందుకే పోలీస్ స్టేషన్ వరకు రాకముందే తన వద్దకు పెద్ద ఎత్తున పిటిషన్లు వచ్చాయని తెలిపారు. ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పెంపకం లోపమని కూడా అంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం పన్నులమయం చేసిందని, గ్రీన్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ, కొంతమంది నాయకుల చేతుల్లో ఉండిపోయారని పేర్కొన్నారు. మహిళలపై లైంగిక దాడి జరిగితే హోంమంత్రి వచ్చి తల్లిదండ్రుల పెంపకం తప్పు, దొంగతనం చేయడానికి వచ్చి అలా చేశాడని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని, ఎంత కరెంట్ వాడుకున్నా ఉచితమని చెప్పి ఇప్పుడు వేల రూపాయల బిల్లులు వేస్తున్నారని విమర్శించారు. తాను 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటే వైసీపీ వారంతా తనను తిడతారని, ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఒకేరోజు మిస్ అయినట్లు పేపర్లో వార్త వచ్చిందని పేర్కొన్నారు.