రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ పేర్కొన్నది. మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో 10 మంది మరణించారు.
వీరిలో ప్రిగోజిన్ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది. ప్రిగోజిన్ మరణమే కనుక నిజమైతే అది ప్రమాదం కాకపోవచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యేవ్జెని ప్రిగోజిన్ ఒకప్పుడు హాట్ డాగ్స్ అమ్మేవాడు. క్యాటరింగ్ కంపెనీ నడిపాడు. క్రెమ్లిన్‌కు ఫుడ్‌ను సరఫరా చేసేవాడు. పుతిన్ చెఫ్ అన్న నిక్‌నేమ్‌ను అతను సంపాదించుకున్నాడు. ఓ దశలో పుతిన్‌కు సన్నిహితంగా ఉన్నారు. ఆ సమయంలోనే అంటే.. 2014లో మొదటిసారి ఆయన వాగ్నర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇది రష్యా ప్రైవేటు మిలటరీ దళంగా పనిచేసేది. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించడంలో పుతిన్‌కు ప్రిగోజిన్ అండగా నిలిచారు.
తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా వేర్పాటువాద దళాలకు తొలుత అండగా ఉన్నారు. ఆ సమయంలో ఇదో సీక్రెట్ ఆర్గనైజేషన్. ఈ గ్రూపుకు చెందిన దళాలు ఎక్కువగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లో ఆపరేట్ చేశాయి. దాదాపు 5 వేల మంది ఫైటర్లు ఆ దళంలో ఉన్నారు.
వీళ్లంతా గతంలో రష్యా ఆర్మీలో చేసినవాళ్లే. గత పదేళ్ల నుంచి ఉక్రెయిన్ బోర్డర్ వెంట రష్యా ఆర్మీకి అండగా వాగ్నర్ గ్రూపు పోరాడింది. కానీ తర్వాత కాలంలో రష్యాకు వ్యతిరేకంగా మారింది. సైనిక తిరుగుబాటుకు దిగింది.
ఆయన జీవితం చిల్లర దొంగతనాలతో ప్రారంభమైంది. 1980వ దశకంలో ఆయనపై అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో శిక్ష పడటంతో ఆయన పదేళ్లపాటు జైలులో గడిపారు. టీనేజ్లోనే ఆయనకు 13 ఏళ్ల కారాగారవాస శిక్ష పడింది. 1990లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
1990లలో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉండటాన్ని గమనించిన ప్రిగోజిన్ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మోడెస్ట్ హాట్ డాగ్ సెల్లర్‌గా మారారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ చాలా పెద్దవాటినే ఆయన కోరుకునేవారు. 1995లో రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించారు.
కమ్యూనిస్టు పాలనలో రష్యన్లకు విలాసాలు తెలియవు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రజలు విలాసాలను కోరుకున్నారు. వారికి తగినట్లుగానే సేవలను అందించి, భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు. అనంతరం రష్యాలోని సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు. అంతే వేగంతో రష్యా పాలక వర్గానికి సన్నిహితంగా మారారు.
2014లో క్రిమియాపై రష్యా యుద్ధం చేసిన సమయంలో వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యాన్ని ప్రారంభించారు. రష్యా సైన్యంతో కలిసి వాగ్నర్ గ్రూప్ దళాలు పోరాడాయి. అయితే ఈ కిరాయి సైన్యంతో తనకు సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన 2022లో మాత్రమే అంగీకరించారు.