బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాలు సభ్యులుగా చేరనున్నాయి. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాల కొత్త సభ్యులను చేర్చుకోనున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా గురువారం ప్రకటించారు. ”మేము బ్రిక్స్‌లో పూర్తి సభ్యులు కావడానికి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాము. 2024 జనవరి నుండి ఆయా దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది ” అని రమాఫోసా జోహెన్స్ బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పేర్కొన్నారు.
బ్రిక్స్ 15వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. బ్రిక్స్‌ను విస్తరించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ విస్తరణ సభ్య దేశాల సహకారానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు.
ఈ విస్తరణ బ్రిక్స్ ఐక్యత, సహకారం సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాప్రికాలు సభ్యదేశాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సమావేశాల ముగింపు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో 15వ వార్షిక బ్రిక్స్ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కూటమిని మరింత విస్తరించాలన్న అభిప్రాయానికి ఆమోదం లభించిందని తెలిపారు. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ అనుకూలమేనని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ విస్తరణ వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని, ఎక్కువ ప్రభావవంతంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తితోనే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలను బ్రిక్స్ లోకి భారత్ ఆహ్వానిస్తోందని ప్రధాని మోదీ వివరించారు.
జిన్‌పింగ్ తో మాట కలిపిన మోదీ
బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్‌పింగ్‌తో మోదీ ఏదో మాట్లాడారు. భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఆసక్తి రేగుతోంది.
బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా దేశాల కూటమి బ్రిక్స్ సమావేశాలు జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఈ దేశాల నేతలంతా గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎవరికి కేటాయించిన ఆసనాల్లో వారు కూర్చొనడానికి వెళ్తున్నపుడు జీ, మోదీ తారసపడ్డారు. ఆయనతో మోదీ ఏదో చెప్తూ చకచకా ముందుకు వెళ్లి, తనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు.