జి 20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలోని పలు మెట్రోస్టేషన్ల గోడలపై ఖలీస్థానీ అనుకూల రాతలు వెలువడడంతో కలకలం రేగింది. వచ్చే నెల 9 , 10 తేదీలలో స్థానిక ప్రగతి మైదాన్‌లో అధునాతన కన్వెన్షన్ సెంటర్లో జి 20 సమ్మిట్ జరుగుతుంది. `ఢిల్లీ బనేగా ఖలీస్థాన్’, `ఖలీస్థాన్ రెఫరెండం జిందాబాద్’ అనే నినాదాలు ఆదివారం పలు స్టేషన్ల గోడలపై, ప్రముఖంగా కన్పించే చోట్ల వెలియడం సంచలనానికి దారితీసింది.
శివాజీ పార్క్, పంజాబీ బాగ్ ప్రాంత స్టేష్టన్లలో వీటిని కొట్టోచ్చే రీతిలో గుర్తు తెలియని వ్యక్తులు కన్పించేలా చేశారు. కాగా నంగ్లోయిలోని ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయ పాఠశాల గోడపై కూడా భారత వ్యతిరేక రాతలు వెలిశాయి. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) ఈ రాతలకు దిగిందని వెల్లడైంది.
ఈ మధ్యకాలంలో పలు మెట్రోస్టేషన్లలో ఎస్ఎఫ్జె కార్యకర్తలు కన్పిస్తున్నారని, వీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జి 20 సదస్సును మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు దేశాలకు చెందిన అగ్రనేతలు ఈ సమ్మిట్‌కు తరలివస్తున్నారు.
ఆదిలోనే ఖలీస్థానీ అనుమానిత శక్తులను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసు అధికారులు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల నిఘా వేసి ఖలీస్థానీ వాదులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.