టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. తల్లి భువనేశ్వరి కూడా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం 2700 కిలోమీటర్ల మైలు రాయిని నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంటుంది.
ఈ సందర్బంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర అధికార ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ ప్రజల ఆశీర్వాదాలతో విజయవంతంగా సాగుతుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ టీడీపీ అధినేత అభినందించారు. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర చేశారు. రోజుకు సగటున 13.5కి.మీ మేర పాదయాత్ర సాగుతుంది.
యువగళం ద్వారా 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెం లో గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు. 200 రోజుల పాదయాత్ర సందర్భంగా లోకేష్ కి శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలు జంగారెడ్డి గూడెం చేరుకున్నారు. 200వ రోజు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం బృందాలు ఏర్పాట్లు చేశాయి.
యువగళం పాదయాత్ర బుధవారం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తించింది. అడుగడుగునా జనం నీరాజనాలు పాడుతూ సమస్యలను ఏకరవుపెట్టారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేష్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనపై ఘాటు విమర్శలు చేశారు.
విశాఖలో బస్ షెల్టర్ కట్టడం చేతకానోడు 3రాజధానులు, పోలవరం కడతాడా అంటూ ఎద్దేవా చేశారు. బొర్రంపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రావికంపాడు క్రాస్ వద్ద చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనంతరం రావికంపాడు, దేవలపల్లి, పుట్లగట్లగూడెం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఆటోనగర్, బస్టాండు, బైపాస్ మీదుగా దండమూడి కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది. 199వరోజు యువనేత లోకేష్ 20.8 కి.మీ.ల పాదయాత్ర చేశారు.
ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2690 కి.మీ.లు పూర్తయింది. గురువారం పాదయాత్ర 200వ రోజుకు చేరుకోవడంతోపాటు 2700 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా సీతంపేటలో యువనేత లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.