తెలుగు రాష్ట్రాలకు వాతవారణ శాఖ చల్లని కబురు చెప్పింది. చాలా రోజులుగా వర్షాబావంతో పొడిబారిన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
భారీ వర్షాలతో పాటు అక్కడక్కా పిడుగులు కూడా పడే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఏపీకి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతో తెలంగాణ వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అటు రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.