జాబిల్లి రహస్యాలను తెలుసుకోడానికి స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్‌ను కూడా జపాన్ పంపించింది. ఈ ల్యాండర్ మూడు , నాలుగు నెలల తరువాత చంద్రుడి కక్ష లోకి ప్రవేశిస్తుంది. అంటే వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో ఈ స్లిమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ రాకెట్ ప్రయోగం పలుమార్లు వాయిదా పడినప్పటికీ గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. జాబిల్లి, ఇతర గ్రహాల పైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీతో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు.
సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలో మీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. కానీ నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. ఇటీవలనే భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతంగా జాబిల్లిపై కాలుమోపిన విషయం తెలిసిందే.
చంద్రుడిపై ఇప్పటివరకు నాలుగు దేశాలే (అమెరికా, రష్యా, చైనా, భారత్ ) అడుగుపెట్టగా, ఇప్పుడు అనేక దేశాలు జాబిల్లి పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. జాబిల్లి పైకి స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) ల్యాండర్ ను విజయవంతంగా ప్రయోగించడంపై జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు ఇస్రో అభినందనలు తెలియజేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కమ్యూనిటీలో మరో దేశం విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపాలని ఆకాంక్షించింది.