టీడీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకు చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆర్థిక నేరాలకు బెయిల్ ఇవ్వకూడదన్న సీఐడీ వాదనలకు ఏకీభవించిన కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీసులు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బృందం సుమారు 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు.
శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు విజయవాడకు తరలించారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఆదివారం ఉదయం నుంచి ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి.
రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.
చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సీఐడీ ఈ ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. అందులో పలు ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన అనేక అంశాలను వివరించింది. చంద్రబాబు ప్రధాన ముద్దాయి గా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లను సీఐడీ ప్రస్తావించింది. ఈ రిమాండ్ రిపోర్టును అనుమతిస్తూ రిమాండ్ కు పంపాలని సీఐడీ న్యాయస్థానంను కోరింది.