టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు విజయవాడలో ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు.
చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు.
హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కు ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయించారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు.
జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్ జైలు వద్దకు చేరుకున్నారు. సదుపాయాలపై అధికారులతో చర్చించారు.
రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
అటు చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటీషన్ పైన ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు నాయుడుకు ఎసిబి కోర్ట్ రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన చేస్తున్నాయి. ఇదిలావుండగా చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా రేపు ఎపి బంద్‌కు టిడిపి పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది.
ఈ పరిస్థితుల్లో ఎపిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్‌పిలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.