ప్రస్తుతం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఒకవేళ బైటకు వస్తే, తిరిగి మరో కేసులో అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఒక వంక ఆయన బెయిల్ పిటీషన్ పై వాదోపవాదాలు జరుగుతూ ఉండగానే సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసిన సీఐడీ చంద్రబాబును విచారించాలని కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ పేర్లను సైతం చేర్చింది. ఇందులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులు చేశారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మే 10న ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
సెక్షన్ 420, 166, 34, 26, 37, 120 బీ వంటివి ఇందులో చేర్చారు. రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది కలిగించేలా ఇన్నర్ రింగ్ అలైన్మెంట్స్ మార్చారని రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు
ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై గతేడాదే చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో శనివారం అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
