ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు,యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వివిధ పరిశ్రమలు, సంస్థల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ అందించి వారికి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కళాశాల సహా మొత్తం 26,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు సహా 192 చోట్ల ఐటిఐలు, పాలిటెక్నిక్ కళాశాలు,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, నాక్ కేంద్రాల అనుసంధానంతో స్కిల్ హబ్‌లు, 55 ప్రాంతాల్లో స్కిల్ స్పోక్సు ఏర్పాటు ద్వారా ఇప్పటికే వివిధ రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జవహర్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే జర్మన్ భాషలో నైపుణ్య శిక్షణ పొందిన నర్సింగ్ విద్యార్ధినులు త్వరలో జర్మనీ దేశానికి వెళ్ళనున్నారని చెప్పారు. నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్ధ, రాష్ట్రంలోని సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిటిడిసి కేంద్రాల ద్వారా మరిన్నిశిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సెర్ప్ సిఇఓను ఆదేశించారు. పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ, సెర్ప్,ఉన్నత విద్యాశాఖ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, మత్స్య తదితర విభాగాలు కన్వరెన్సు విధానంలో మరిన్ని శిక్షణా కార్యక్రమాలకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని జవహర్ రెడ్డి ఆదేశించారు.
తొమ్మిదో తరగతి నుండి పి.జి. విద్యార్థుల వరకూ ఫార్మల్ ఎడ్యుకేషన్ తో పాటు వృత్తి నైపుణ్యాన్ని కూడా అభివృద్ది పర్చుకునేందుకు వీలుగా డ్రాప్టు ఫాలసీని రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి పాఠశాల, ఉన్నత, కళాశాల విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారానే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువును పూర్తి చేసుకుని బయటకు రాగానే ఏదో ఒక ఉపాధిలో స్థిరపడి జీవనోపాధి పొందే విధంగా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. అందుకు వారు ఫార్మల్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా శిక్షణను ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని, నిరుద్యోగ సమస్య కూడా సాద్యమైనంత మేర సమసిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇందుకై బహిరంగ మార్కెట్ తో పాటు పలు కంపెనీల అవసరాలను బట్టి డిమాండు ఉన్న కోర్సుల్లోను మరియు స్వయం ఉపాధిలో స్థిరపడేందుకు అనుగుణమైన కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ నిచ్చే విధంగా డ్రాప్టు పాలసీని సత్వరమే రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులు పలు ఒకేషనల్ కోర్సుల్లోను చేరే విధంగా, సాంకేతిక విద్యను పెద్ద ఎత్తున అభ్యసించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.