ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి సమీపం లోని సముద్రం లోకి ప్రజలను లాక్కెళ్లింది. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు ఊడ్చిపెట్టుకు పోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఈ ఉత్పాతంతో ఇప్పటికే 2000 మంది మరణించగా, మరో 6000 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని లిబియా ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారి వెల్లడించారు. ఈ వరదల్లో దాదాపు మూడు భారీ వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. సముద్ర తీరం లోని పర్వతాల వద్ద డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలావరకు పర్వత లోయలో ఉన్నాయి.
దీని సమీపంలోని ఒక డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కమ్యూనికేషన్ లైన్లు కూడా నిలిచిపోయాయి.
దీంతో వరద ప్రాంతంలో పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు అంతంత మాత్రమే. వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే ఈ ముప్పు వాటిల్లిందని లిబియా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా అల్యా వెల్లడించారు.
సముద్ర మట్టం, వరద, గాలివేగం, వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదని చెబుతూ ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. తూర్పు తీరం లోని అల్బెడ, అల్మర్జ్, తుబ్రోక్, టాకెనిస్, బెంగ్హజి నగరాలు కూడా వరదలకు ప్రభావితం అయ్యాయి.
లిబియా లోని తమ కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి. యూఏఈ అధినేత అల్నహ్యాన్ తమ దేశం నుంచి గాలింపు, సహాయక బృందాలను పంపినట్టు వెల్లడించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్సిసి ఈ వరదల్లో మృతులకు సంతాపం తెలిపారు.