దేశంలో ధరల సెగ కాస్తంత తగ్గింది. జూలైలో నమోదైన 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతం నుంచి ఆగస్టు నెలలో 6.83 శాతానికి తగ్గింది. కాగా గత ఏడాది ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం ఉంది. ఈ ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం జూలైతో పోల్చితే 11.51 శాతం నుంచి 9.94 శాతానికి తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎ్సఓ) గణాంకాలు తెలుపుతున్నాయి.
అయినప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 6 శాతం కన్నా పైనే ఉంది. రెపో రేట్ల నిర్ణయంలో ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్నే గీటురాయిగా తీసుకుంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను ఆర్బీఐ 5.4 శాతంగా ప్రకటించింది. ఎన్ఎ్సఓ గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం జూలైతో పోల్చితే 37.4 శాతం నుంచి 26.14 శాతానికి తగ్గింది.
అలాగే ఆయిల్ అండ్ ఫ్యాట్స్, మాంసం, చేపలు, గుడ్లు; సుగర్ కన్ఫెక్షనరీ, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు, పళ్లు, తయారీ ఆహార వస్తువుల ధరలు కూడా ఆగస్టులో తగ్గాయి. కోర్ ద్రవ్యోల్బణం కూడా (ఆహారం, పానీయాలు; ఇంధనం, లైటింగ్, పెట్రోల్, డీజిల్ మినహా) ఆగస్టులో 5.06 శాతానికి తగ్గిందని ఎన్ఎ్సఓ తెలిపింది.
కాగా, దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు జూలై నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5.7 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల గరిష్ఠ స్థాయి. తయారీ, మైనింగ్, పవర్ రంగాలు మంచి పనితీరు కనబరచడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 6 శాతం వృద్ధి రేటు తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయి ఇదే.