జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక ఆర్మీ కర్నల్, మేజర్‌తోపాటు, జమ్మూ పోలీస్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
అనంత్‌నాగ్ జిల్లాలోని కోకర్నాగ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఈ భీకర దాడులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి.
అనంత్‌నాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వారిని పట్టుకునేందుకు మంగళవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం ఉదయం వరకు ఆపరేషన్ చేపట్టాయి. ఆ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రమూకలు దాడులకు తెగబడటంతో పోలీసులు కూడా ఎదురుదాడి జరిపారు.
కమాండింగ్ ఆఫీసర్, డీఎస్పీ నేతత్వంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగింది. అయితే ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు (19ఆర్ఆర్) చెందిన కమాండింగ్ అధికారి మన్‌ప్రీత్ సింగ్, ఆర్మీ మేజర్ మనోజ్ ఆశీష్ ఢోన్‌చక్, జమ్ముకాశ్మీర్ పోలీసుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి హుమన్యూన్ ముజాహిల్ భట్ తీవ్ర గాయాలపాలయ్యారు.
వారిని రక్షించేందుకు అదనపు బలగాలు ప్రయత్నించినప్పటికీ.. ఉగ్రవాదులు నుంచి తీవ్ర స్థాయిలో కాల్పులు కొనసాగడంతో వారిని తరలించడం సాధ్యం కాలేదు. దీంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఆర్మీకి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ జాగిలం తన హ్యాండ్లర్‌ను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిందని డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.