బేబీ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలని దృశ్యాలను చూపించారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని దృశ్యాలను చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తామని వెల్లడించాయిరు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
మాదాపూర్‌లోని ఫ్రెష్లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించిన సమయంలోని సన్నివేశాలే ‘బేబీ’ సినిమాలో ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్ ఏ విధంగా వాడాలో ఒక సీను ఉంటుందని, సేమ్ అలానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు వినియోగదారులు, సినిమాలో సీన్ ను చూసి డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా సినిమాలు తీయవద్దని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారన్నారని సిపి చెప్పారు. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. హీరో నవదీప్ కూడా ఇందులో ఉన్నారని, ప్రస్తుతం అతను పరారీ ఉన్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలోనే బేబీ చిత్రంపై సీపీ సీరియస్ అయ్యారు.
కొద్దిరోజుల క్రితం మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొందరు టాలీవుడ్ ప్రముఖుల పాత్ర ఉండటంతో సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది.
ఈ కేసులో వినియోగదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్ గా హీరో నవదీప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సీపీ ఆనంద్ ప్రకటించారు. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు కీలక వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, డ్రగ్స్ కేసులో తన పేరు రావటంతో హీరో నవదీప్ ఓ మీడియా చానెల్ తో మాట్లాడుతూ తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.