అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢకొీని భారతీయ విద్యార్థి మరణించిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై చులకనగా మాట్లాడిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎంబసీ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.
అమెరికాలోని సియాటిల్‌లో జనవరి 23న పోలీస్ పెట్రోలింగ్ వాహనం మితిమీరిన వేగంతో పాటు, రాంగ్ రూట్లో వచ్చి ఢ కొనడంతో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి ఒక పోలీసు అధికారి చులనకగా మాట్లాడినప్పుడు అతని బాడీ కెమెరాలో నమోదైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ పోలీసు అధికారి నవ్వుతూ ‘లేదు, ఓ రెగ్యులర్ పర్సన్. యా, జస్ట్ 1100 డాలర్ల చెక్ రాయండి’ అని వ్యాఖ్యానించాడు. ఈ ప్రమాదంపైనా, పోలీసు అధికారిపైనా సాధారణ ప్రజలతోపాటు అమెరికా చట్ట సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌సింగ్ కూడా ఈ ప్రమాద అంశాన్ని వాషింగ్టన్లో అత్యున్నత స్థాయిలో లేవనెత్తారు.
దీంతో జాహ్నవి కందుల మృతిపై త్వరితగతిన విచారణ పూర్తి చేస్తామని, బాధ్యులైన పోలీసు అధికారుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతామని అమెరికా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది.
జనవరి 23న ప్రమాద సమయంలో పోలీసు వాహన వేగం గంటకు 119 కి.మీలుగా ఉందని, మితిమీరిన వేగంతో ఢీకొనడంతో ఆమె దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు అమెరికాకు చెందిన ఒక వార్తాసంస్థ సోమవారం తెలిపింది.
ఓ డ్రగ్స్ కేసు దర్యాప్తునకు బయల్దేరిన పోలీసు అధికారి కెవిన్ డేవ్ ప్రమాద సమయంలో గంటకు 119 కి.మీల వేగంతో ప్రయాణించినట్లు సియాటిల్ పోలీసు విభాగం ఒక నివేదికలో తెలిపింది. పెట్రోలింగ్ వాహనం మూడింతల వేగంతో ప్రయాణిస్తుండ టంతో ఆమెకు ప్రమాదాన్ని గుర్తించే, తప్పించుకునే సమయం కూడా లభించలేదని పోలీసులను ఉటంకిస్తూ మరో వార్తాసంస్థ తెలిపింది.
తీవ్ర గాయాలపాలైన ఆమెను హార్బర్వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించగా అప్పటికే మరణించారు. నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ సియాటిల్ క్యాంపస్ లో చదువుతోన్న, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి(23) ఈ డిసెంబర్లో మాస్టర్స్ పట్టా పొందా ల్సింది. జనవరి 23న కళాశాల నుంచి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో మృతిచెందిన కందుల జాహ్నవి విషయం లో అమానవీయంగా మాట్లాడిన అమెరికా పోలీసు అధికారిపై చర్యలకు సిఫార్సు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎపి ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని, తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి మృతదేహాన్ని కర్నూలు జిల్లాలో ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.