టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, శ్రీనివాస సేతు, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను శుక్రవారం అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.
సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అంతకు ముందు తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాససేతును ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు రూ 650 కోట్లతో నిర్మించిన వంతెనపై 19వ తేదీ నుండి వాహనాల రాకపోకలు అనుమతిస్తారని వెల్లడించారు.
యాత్రీకులు, స్థానికులకు కూడా శ్రీనివాస సేతు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతూ అనంతరం టీటీడీ ఉద్యోగులకు కొందరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వడం కోసం మరో 200 ఎకరాలు కావాలని తాను ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. 200 ఎకరాల భూమి సమీకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారని కరుణాకరరెడ్డి వివరించారు.
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుంటారని తెలిపారు. సుమారు 400 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించేవారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం నుంచి ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడం పట్ల తిరుపతి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.