స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సారి దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిందని, ఇందులో రూ.371 కోట్లు దారిమళ్లించారని తెలిపారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తు తేలిందని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని వెల్లడించారు.
టీడీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ తోనే నిధులు మళ్లించినట్లు సీఐడీ చీఫ్ అభియోగించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ స్కామ్ లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేశామని, ఆయనకు కోర్టు రిమాండ్ విధించిందని పేర్కొన్నారు.
సెప్టెంబరు 5న చంద్రబాబు పిఎ పెండ్యాల శ్రీనివాస్‌కి నోటీసు ఇచ్చామని, అయితే 24 గంటల్లో ఆయన విదేశాలకు పారిపోయాడన్నారు. సీమెన్స్ ద్వారా మాత్రమే 2.13 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారనడం సరికాదని, నాలుగైదు సంవత్సరాల నైపుణ్యాభివృద్ధి కృషి ఫలితమని చెప్పారు.