తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా ఆరు గ్యారంటీ పధకాలను ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆమె భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సోనియా చెప్పారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు పథకాలను ప్రకటిస్తున్నామని పేర్కొంటూ వీటిని కచ్చితంగా అమలు చేస్తామని ఆమె తెలిపారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని ఆమె తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతిస్తారా? అంటూ ఆమె సభకు హాజరైన ప్రజలను కోరగా అందరూ లేచి నిలబడి కరతాల ధ్వనులు చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్షి పథకం కింద నెలకు రూ.2500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుచేస్తామని ఆమె వెల్లడించారు. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరించారు.
సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు
1. మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
2. రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
3. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
4. ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.
5. యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6. చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.” వర్తిస్తుందని కాంగ్రెస్ తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.15వేలు, రూ. 12వేలు ఆర్థికసాయం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రకటించారు. పట్టాదారు రైతులకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేల చొప్పున చెల్లించేందుకు మాట ఇస్తున్నామని ఆయన విజయభేరీ సభ ద్వారా ప్రకటించారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంపై విమర్శలు గుప్పిస్తూ ఈ పార్టీలు పైకి విడిగా కనిస్తున్నా, అంతా ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో బీజేపీ తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
దేశంలో ప్రశ్నించిన వారిపైనే మోదీ సర్కార్ కేసులు పెట్టి వేధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి రాగానే అమలుచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.