తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తీరుపై మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో పాత పార్లమెంట్ భవనంలో చివరిసారి సమావేశంలో మాట్లాడుతూ అక్కడు తీసుకున్న పలు నిర్ణయాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు.
వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికాబద్ధంగా చేశారని గుర్తుచేశారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయని తెలిపారు. కానీ ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఎక్కడా సంబరాలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ విభజన రెండు తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పర్చలేకపోయిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని, అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని చెప్పారు. పైగా, తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని విచారం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్నారు. 2022 ఫిబ్రవరిలో లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వార్థరాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గు పడే విధంగా కాంగ్రెస్ విభజించిందని తీవ్ర విమర్శలు చేశారు.
అత్యంత దారుణంగా ఏపీని విభజించారని పేర్కొంటూ మైకులు ఆపేసి, పెప్పర్ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారని విమర్శించారు. విభజన సమయంలో చాలా కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం అలా చేయలేదని దయ్యబట్టారు. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుందని చెబుతూ అలాంటి వ్యవహారాన్ని సాదాసీదాగా చేశారని ధ్వజమెత్తారు. వాజ్ పేయ్ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని, ఎక్కడా చిన్న సమస్య కూడా రాలేదని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్ హడావుడిగా చేసిన విభజనతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరిగిందని మండిపడ్డారు