తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలి, ఎన్నిఈవీఎంలు అవసరం,? భద్రత ఏవిధంగా ఉండాలి? వంటి అన్ని అంశాలనూ పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఓ బృందం అక్టోబర్ 3న తెలంగాణకు రాబోతోంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఈ బృందం మూడు రోజుల పర్యటనలో పరిశీలిస్తుంది.
ఈ పర్యటన సందర్భంగా ఈ బృందం మొత్తం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలు తెలుసుకుంటుంది. అలాగే జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలను కలిసి మాట్లాడుతుంది. మొదటి రోజు ఈ ఎన్నికల బృందం ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, ట్రాన్స్పోర్ట్, ఇతర నిఘా విభాగాల అధికారులను కూడా కలుస్తుంది.
ఎన్నికల సమయంలో నగదు, మద్యం, ఉచిత బహుమతులు ఇవ్వకుండా ఎలా అడ్డుకోవాలి? అనే అంశంపై వారితో చర్చిస్తుంది. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దానిపైనా చర్చిస్తుంది. ఈ బృందం రాష్ట్రంలోని ఎన్నికల ప్రధాన అధికారిని కలుస్తుంది. అలాగే, రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా కలిసి సమీక్ష నిర్వహిస్తుంది. భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లను తెలుసుకుంటుంది.
ఈ బృందం రెండో రోజు ఎన్నికల అధికారులు, ఎస్పీలు, అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లను కలిసి.. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటుంది. ఇక మూడో రోజు రాష్ట్ర ఉన్నతాధికారులైన చీఫ్ సెక్రెటరీ (CS), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) , ఇతర ఉన్నతాధికారుల్ని కలిసి ఏర్పాట్లపై సమీక్షిస్తుంది.
మరోవంక, రాష్ట్రంలో ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. సెలెబ్రిటీలు, దివ్యాంగ ఓటర్లు, యంగ్ ఓటర్లను కలుస్తుంది. ఓటర్ల జాబితా కోసం ప్రచారం చేస్తున్న ఓటర్లను కూడా కలుస్తుంది. తర్వాత ఢిల్లీ వెళ్లి తన రిపోర్టును ఈసీఐకి ఇస్తుంది. తర్వాత ఈసీ రంగంలోకి దిగి ఎన్నికలు జరిపించేస్తుంది.
నవంబర్ లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 డిసెంబర్ 13న అధికారంలోకి వచ్చింది. అందువల్ల డిసెంబర్ 12, 2023 వరకూ ఈ ప్రభుత్వానికి గడువు ఉంటుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 12 తర్వాత కొలువుదీరాల్సి ఉంటుంది.