టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు అక్రమంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ అభియోగించింది.
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చంద్రబాబుపై పీటీ వారెంట్ వేసింది.
ఫైబర్ నెట్ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది.
అయితే వేమూరి హరిప్రసాద్ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగిస్తోంది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తుంది.
టెండర్ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకం వ్యవహరించారని, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని సీఐడీ అధికారులు గుర్తించారు.
మరోవంక, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఐదుగురు న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? లేదా? డబ్బులు పోయాయని ఒకవైపు సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూకపపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించింది.
ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.
మరోవైపు, అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రధానంగా షెల్ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదని పేర్కొన్నారు. కార్పొరేషన్ సంబంధించి న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని, వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు.